
- హైదరాబాద్‌లోని మత్స్యశాఖ భవన్‌లో ముదిరాజ్, గంగపుత్ర సంఘాల వాగ్వాదం
మెహిదీపట్నం, వెలుగు : కొండపోచమ్మ సాగర్‌లో చేపలు పట్టుకునే హక్కుల విషయంలో ముదిరాజ్, గంగపుత్ర సంఘం సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బుధవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని మత్స్యశాఖ భవన్‌కు వచ్చిన ఇరు వర్గాలు కార్పొరేషన్ చైర్మన్ల ముందే గొడవకు దిగారు. రిజర్వాయర్‌లో చేపలు పట్టే హక్కు తమకే ఉందని గంగపుత్ర సంఘం సభ్యులు చెప్పగా... బీఆర్‌ఎస్ సర్కార్ ఇచ్చిన జీవో ప్రకారం ఆ హక్కు తమదేనని నిర్వాసితులైన మామిడాల, బైలంపూర్, తనేంధర్‌పల్లి, లంబాడితండా, పాములపర్తి గ్రామాలకు చెందిన ముదిరాజులు స్పష్టం చేశారు.
ఈ విషయంలో ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. దీంతో ముదిరాజ్, మత్స్య శాఖ కార్పొరేషన్ల చైర్మన్లు బుర్ర జ్ఞానేశ్వర్, మెట్టు సాయికుమార్ జోక్యం చేసుకొని సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇరువర్గాలకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఇరు సంఘాల సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.